Tribute To lyricist Shiva Ganesh p2

Date : Aug 16 2019             Views :

మార్నింగ్ రాగా : మ‌ర‌ణం అను అనురాగ తీరాన‌"మాలై పొళుదిలొరు మేడై మిసైయే
వానైయుం కడలైయుం నోక్కి ఇరుందేన్...
మూలైక్కడలినైవ్ వానవళైయం
ముత్తమిట్టే తళువిముగిళ్దల్ కండేన్..."


"బోంబే జ‌య‌శ్రీ ఆల‌పించిన ర‌స‌స్ఫోర‌క శృంగార గీత‌మిది.పల్లవించింది తమిళకవి సుబ్రహ్మణ్య భారతి గుండెలో.పరిఢవిల్లింది"కణ్ణమ్మ పాట్టు" అనే కావ్యం లో .."మహాకవి భారతీయార్‌"గా ప్రసిద్ధి గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య భారతి తమిళభాష ..కాదు కాదు..ఏ భారతీయభాషైనా గర్వించదగ్గ కవి.జాతీయకవి గా బృహద్గౌరవాన్ని అందుకున్న ఏకైక దక్షిణ భారతకవి.32 భాషలు తెలిసిన అరుదైన జన్మ. ఏ కవితా ప్రక్రియలో నైనా పరా కాష్ ని స్పర్శించగలిగిన స్రష్ట, ద్రష్ట ఆ..ఆధునిక కవి బ్రహ్మ.." అని అంటారు శివ‌గ‌ణేశ్ (చెన్న‌య్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత‌)
"సాయం సంధ్యా వేళ సమున్నత స్థానం పై కూర్చొని
వినీల సాగరాన్నీ, విహాయసాన్నీ, కనులారా వీక్షించాను..
సుదూ...రంలో సముద్ర తీరాన్ని ఇంద్ర ధనస్సు
ముద్దు పెట్టి, హత్తుకొని, ఆనందించడాన్ని ఆస్వాదించాను.."


స్థాణువుగా ఉన్న నా చెంత స‌ముద్రం ఓ అద్భుతం.ప్రేమ రాహిత్యానికి తీసుకెళ్ల‌నీయ‌ని ఆకాశం ఓ అద్భుతం.విలాపానికి తావే లేని నిరీక్ష‌ణ ఇది.శృంగారాంబోధిలో సంచ‌రించు స‌మ‌య‌మిది. మోహ‌ మిది.కాదు ఆరాధ‌న ఇది.ఆమె గారి త‌ల‌పుల మున‌క‌లో చేస్తోన్న ఆవాహ‌నఇది.ర‌స ప్లావిత‌ మి ది.క‌ణ్ణ‌మ్మా నువ్వెక్క‌డ‌..? గొప్ప‌వాడు సుబ్ర‌హ్మ‌ణ్య భార‌తి.. సృజ‌న కాదిది తాదాత్మ్యానికి మ‌రో రూప‌మిది.ప‌రులెవ్వ‌రూ అందుకోలేని ప‌ర‌వ‌శ‌మిది.ఈ సాహిత్య వైశిష్ట్యం గురించి ఈ విధంగా వివ‌రించారు శివ‌గ‌ణేశ్‌."దేవులపల్లి కి 'ఊర్వశి' , నండూరి కి 'ఎంకి లా , భారతీయార్ కి 'కణ్ణమ్మ'. నిజానికి ఆయన ప్రతీ స్త్రీని శక్తి స్వరూపిణిగానే చూసేవారు.తన భార్యని ఒక వ్యక్తి గా కాకుండా తనలోని కవితా శక్తికి ప్రేరణ కలిగించే అద్భుత శక్తిగా ఆరాధించే వారు. ' చెల్లమ్మ'అసలు పేరైనా 'కణ్ణమ్మ' కొసరు పేరు.భారతీయార్ పెట్టుకున్న ముద్దుపేరు.కణ్ణమ్మ మకుటంతో వచ్చిన పాటలు ఎన్నో. అన్ని పాటలు ఆణి ముత్యాలే.ఆర్ద్రతా జన్యాలే. అందుకే వాటిలో ఓ తియ్యని వేదన కనిపిస్తుంది. అది మనసుని సుతారంగా మీటుతుంటుంది అనుభూతిని పంచుతూ... "


నీల నెరుక్కిడైయిల్ నెంజు సెలుత్తి
నేరం కళివదిలుం నినైప్పిన్రియే ...
సాల ప్పలపల నఱ్పగర్కనవిల్
తన్నై మఱందనయందన్నిల్ ఇరుందేన్...


నింగి లోని నీలిమతో గుండె లీనమై
కాలగమనాన్ని సైతం గమనించక ..
మధుర మనోహర స్వప్న వాహిని లో తేలియాడి
నన్ను నేనే మఱచి పోయే స్థితిలో నుండి పోయాను..
ఒక్కోసారి ఆమె గారి ఊహ.. ఓ శ్లేష‌.రెప్ప‌ల స‌డి చెంత నిత్యం అనునర్తించే క‌ల‌.నివాళి అంటామే అదే ఇది.క‌న్నీటి ప‌ర‌దాల‌లో తాను కాన‌వ‌చ్చు. క‌న్నీటి తెర‌వేల్పుగా ప్రేమ మిగ‌ల‌వ‌చ్చు.ఒకానొక అనుసృజ‌న‌గా రూపాంత‌రం చెంది ఇదిగో ఇలా పాట రూపంలో ప‌రిమ‌ళించు.తీరాలు దాటి.. వింటున్నంత సేపు ఓ భావోద్వేగం వెన్నాడుతుంటుంది. క‌ర్ణాట‌క సంగీత విదుషీమ‌ణి బోంబే జ‌య‌శ్రీ గాత్ర మ‌హిమ అంత‌టి గొప్ప‌ది.ఇదమిత్థం అని ఇది అని వ‌ర్ణించ‌లేనిది. నిర్వ‌చ‌నోత్త‌మ అభివ్య‌క్తికి అది అంద‌నంత ఎత్తు.ఔను! ఆ స్వ‌రం చెంత ఆ శిఖ‌రం చెంత నేనో బుజ్జాయిని.. నేల‌కు చేరువగా.. అంబాడుతూ..! ఇంకా శివ‌గ‌ణేశ్ ఏమంటున్నారంటే.. "అచ్చతెలుగు అంటాం చూడండి అలానే సెన్ తమిళ్ లో రాశారీ పాట‌ను మ‌హాక‌వి భార‌తి.క‌విత్వం పారంప‌ర్యంగా రావ‌చ్చు.సాధ‌నపూర్వ‌కంగారావ‌చ్చు.కానీ ఇత‌డు అనుభూతి ప్ర‌ధాన క‌వి.ఓ విధంగా వాగ‌నుశాస‌ను డు.ద‌క్షిణ భార‌త క‌విగా ప్ర‌సిద్ధికెక్కి, జాతీయ స్థాయిలో గుర్తింపునీ ..గౌర‌వాన్నీ అందుకున్నారు.శృంగారం, విప్లవం, దేశభక్తి, సామాజిక స్పృహ ఆయన రచనలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.పాంచాలీ శపథం, పాప్పా పాట్టు, కుయిల్ పాట్టు మొదలైనవి ఆయన ఇతర రచనలు. వార‌ణాసి లో చ‌దువుకున్నారు.ఆధ్యాత్మిక ఉపాసన అక్క‌డే..! ఎంతో శ్రద్ధ తో 29 భార‌తీయ భాష‌లు(లిపి లేనివి క‌లుపుకుని), 3 విదేశీ భాష‌లు నేర్చుకు న్నారు.ఆయన ఎక్కువ కాలం పాత్రికేయుడిగా స్వదేశీ మిత్రన్, ఇందియా, విజయా, బాలభారతం మొదలైన పత్రికలలో పని చేశారు.


ఆంగ ప్పొళుదినిలెన్ పిన్ పుఱత్తిలే
ఆళ్ వందు నిన్రెనదు కణ్ మఱైక్కవే...
పాంగిన్ర కై ఇరండుం తీండి అఱిందేన్..
పట్టుడై వీసు కమళ్ తన్నిలఱిందేన్..


ఆ..మాంత్రిక తరుణంలో నా వెనుక మాటుగా
ఓ వ్యక్తి వచ్చి నా కనులను మూయగా...
చాచిన చేతుల స్పర్శతో తనని గుర్తుపట్టాను...
పట్టు వలువల పరిమళాలలో తనని పోల్చుకున్నాను..


ఓంగి వరుం ఊవగై ఊట్రిల్ అఱిందేన్
ఒట్టు మిరండుళత్తిన్ తట్టిల్ అఱిందేన్..
వాంగి విడడి కైయై యేడి కణ్ణమ్మా!
మాయం ఎవరిడత్తిల్? ఎన్రు మొళిందేన్...


రివ్వున లేచే జలతారు జలధార లో తనని దర్శించాను..
చప్పున తప్పే గుండె లయలో తనని అనుభూతించాను..
"చాలు తీయవే నీ చేతులు...కణ్ణమ్మా"
ఎవరితోనే ఈ దోబూచులు.. అని స్పందించాను...
చింత‌ని తీర్చే వ‌స్తువు కాదు క‌దా! స్త్రీ.మ‌నోవాంఛ‌ను సంకేతించేందుకే కాదు కదా! స్త్రీ.ఆమెలో ల‌య‌మైన‌ప్పుడు మాత్ర‌మే విన‌వ‌చ్చే గొప్ప అనుశ్రుతి ప్రేమ‌.క‌ణ్ణ‌మ్మా! వింటున్నావా..! గొప్పదైన మ‌కుటం ఇది.త‌మిళ మ‌హాక‌వి ప్ర‌తి "కణ్ణమ్మా పాట్టు "లోనూ..వినిపిస్తుంది.ఇసుక తిన్నెల లో ఆమె రాక .. ఆ ప‌ద స్ప‌ర్శ ఓ దివ్య స్మృతి.ఇంకా చెప్పాలంటే కొద్దిపాటి నైరాశ్యంలో ఉన్న క‌వికి మేలుకొలుపు.ఒక్కో అల చెంత ఒక్కో క‌ల త‌న‌లో తాను క‌ల‌హించ‌క ఆమె రాక ఎంత గొప్ప‌గా ఉంటుందో చెబుతోంది.వెచ్చ‌ని స్ప‌ర్శ‌లో.. ఆమె గారి మౌన సందేశంలో మునిగితేలిన క‌వికి ఈ క్ష‌ణాన సాయంసంధ్యా తీరాన కాలాన్ని బంధించిన‌ట్లుంది.ప్రాయాన్ని ఆమెకు అర్పించిన‌ట్లుంది.ఆమె త‌న వెంట తెచ్చిన నీడ గారి ఆచ్ఛాద న నుంచి తేరుకున్నాక క‌ణ్ట‌మ్మా! చాలు చాలు నీ దోబూచులాట‌లు అంటూ ముక్తాయిస్తాన్నారాయ‌న‌. వ‌హ్‌! ఎంత అద్భుతం.. నీ మాట మ‌ధురం అంటే ఇదే!

"హీ ఈజ్ ఒన్ అండ్ ఓన్లీ..సోల్ ఫుల్ పోయెట్ ఇన్ ఇండియ‌న్ లిట‌రేచ‌ర్‌.కార‌ణ జ‌న్ముడిత‌డు. విప్లవవాది, సంఘసంస్కర్త, స్త్రీ జనాభ్యుదయ వాది.ఎంత వైప్లవ్యం అంటే...తాను ఒక శుద్ధ శ్రోత్రియ శైవ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా, ఒక దళిత యువకుడికి ఉపనయనం చేసి బ్రాహ్మణ హోదాని కల్పించాడు.కులవ్యవస్థ కూకటి వేళ్ళతో పెకళించాల‌న్నాడు.సృష్టి లో స్త్రీ పురుషులిద్దరూ సమానమే అన్నాడు.అలా ఉన్నపుడే సమాజ ప్రగతి సాధ్యం అన్నాడు. భక్తి గీతాలను కేవ‌లం హిందూ దేవుళ్ళ మీద నే కాదు, అల్లా, ఏసు ప్రభువుల మీద కూడ వ్రాయడం..ఆయ‌న మతసామరస్య తత్వానికి నిదర్శనం.కోయంబుత్తూర్ లో భారతీయార్ విశ్వవిద్యా లయం, చెన్నై మెరీనా సాగర తీరంలో భారతీయార్ విగ్రహం, న్యూఢిల్లీలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి మార్గ్, తమిళ్ నాట ఎన్నో పాఠశాలలు ఆయన పేరున వెలియడం మ‌హాక‌వి గొప్ప‌ద‌నానికి నిద‌ర్శ‌నం.త‌ల‌పాగా, మీసక‌ట్టు ఆయ‌న‌లోని విప్ల‌వ భావాల‌కు సంకేతాలు. స్వాతంత్ర్యోద్య‌మంలో పాల్గొన‌డం వ‌ల‌న అనేకానేక క‌ష్టాలకోర్చి, క‌డ‌దాకా క‌టిక పేద‌రికంలో అనుభ‌వించి 38 ఏళ్ల వ‌య‌స్సులో క‌నుమూశారు.ఆయ‌న మ‌ర‌ణానంత‌రం చెల్లమ్మ త‌న అన్న‌య్య అప్పాదురై స‌హ‌కారంతో స‌మ‌గ్ర ర‌చ‌నా సంక‌ల‌నాల‌ను ముద్రింప‌జేశారు.ఇప్ప‌టికీ..ఎప్ప‌టికీ సాహితీ స్ర‌వంతిలో అగ్ర‌గ‌ణ్యుడు ఆయ‌నే! త‌మిళ‌నాటే కాదు యావ‌త్ భార‌తీయ సాహిత్య చ‌రిత్ర‌లో కూడా..!తూత్తుకుడి జిల్లాలో ఏట్టయా పురం అనే చిన్న‌ గ్రామంలో పుట్టి, వేదాలనీ, పతంజలి యోగసూత్రా లనీ, భగవద్గీతనీ అద్భుతంగా తమిళంలోకి అనువదించిన ఘనత ఆయనదే!భార‌తి పాట తీర్థ‌మైతే బోంబే జ‌య‌శ్రీ అనే సంగీత స‌రస్వతి గ‌ళం అనే శంఖులో ప‌డి మ‌హాతీర్థ‌మైంది.." అని వివరించారు శివ‌గ‌ణేశ్‌.

తెలుగు సేత : శివ‌గ‌ణేశ్

  Previous Page                                                                                               - ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
                                                                                                                            

Related Galleries

--- No Related Postst Found ---