Thalaiva Celebrating 44 Years

Date : Aug 17 2019             Views :

న‌చ్చావయ్యా.. రజ‌నీకాంత‌య్యా..!


కోటిన్నొక్క మ‌నుషులు.. చుట్టూ.. చుట్ట‌పు చూపులు చుట్టూ.. ఆర్క్ లైట్ వెలుగులు చుట్టూ.. ఒక్క‌డే వెలిగిపోతున్నాడు కొన్ని ద‌శాబ్దాలుగా.. నెర‌సిన గెడ్డంతో.. బేస్ వాయిస్‌తో.."క‌బాలి రా "అని త‌న రాక గురించి చెప్ప‌క‌నే చెబుతున్నాడు. ఆ.. ఇంట్ర‌డ‌క్ష‌న్ అదుర్స్. దుమ్ము చేర‌ని .. ధూళి ప‌ట్ట‌ని ఆ.. స్టార్ డ‌మ్ అదుర్స్‌. ఉన్నాడా ఇటువంటి మ‌నిషి. స‌మాజం బాగుప‌డాల‌న్న‌ది ఓ కోరిక మాత్ర‌మే కొంద‌రికి. ఆచ‌ర‌ణ ర‌జ‌నీ లాంటి వారికి. ర‌జ‌నీ తెలుగువాడా.. పోనీ త‌మిళం ఆయ‌న మాతృభాషా.. కానేకాదు అత‌డో క‌న్న‌డిగుడు. ఓ సాధార‌ణ కుటుంబం నుంచి ఎదిగివ‌చ్చిన వాడు. ప్రయాణికులకు టిక్కెట్లు కొడుతూ కండ‌క్ట‌ర్ గా బ‌తుకీడుస్తున్న శివాజీరావు గైక్వాడ్ ర‌జ‌నీకాంత్ అయ్యాడు. బాల‌చంద‌ర్ లాంటి దిగ్ ద‌ర్శ‌కులు తీర్చిదిద్దేతే న‌టుడ‌య్యాడు. అంత‌కు మించి గొప్ప సంస్కారి అయ్యాడు.


మ‌న పాల‌కులు త‌ర‌చూ సోది చెబుతారు. లెక్క‌కు మిక్కిలి నీతి చెబుతారు. ఆఖ‌రికి నీకెంత‌.. నాకెంత అని వాటాల‌కు వ‌స్తారు. ఈ దేశం ప‌ట్ల చిత్త‌శుద్ధి ఉన్న పాల‌కులెంద‌రంటే వేళ్ల మీద లెక్కించ‌వ‌చ్చు. అనుకుంటే ఆ..గ‌ణ‌న ఐదే ఐదు నిమిషాల్లో చేయ‌వ‌చ్చు. కానీ త‌న‌వంతుగా ముందు కు వ‌చ్చి న‌దుల అనుసంధానం కోసం ర‌జ‌నీ కోటి రూపాయ‌లు ఇచ్చాడు. రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదాలున్న నేప‌థ్యంలో సాధ్య‌మా కాదా అన్న‌ది అటుంచింతే ఓ గొప్ప ప్ర‌య‌త్నం వెనుక నేనుంటా అని ఎంద‌రెంద‌రు అంటార‌ని?దేవుడు శాసిస్తాడు / అరుణాచ‌లం పాటిస్తాడు అన్న చందంగా.. ర‌జ‌నీ చెప్పారు..ఆయ‌న సోద‌రుడు స‌త్యనారాయ‌ణ పాటించారు. ఈ మొత్తాన్ని నిన్న‌నే బ్యాంకులో జ‌మ‌చేశారు. నదుల అనుసంధాన ప్రక్రియ పనులు ప్రారంభమైన వెంటనే ఆ నగదును సంబంధిత అధికారులకు అందజేయ నున్నామ‌ని స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం కోసం పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, రాజకీయ నేతలు ఇచ్చిన పిలు పునకు రజనీకాంత్ స్పందిం చి.. తన వంతు స‌హాయం చేసేందుకు ముందుకువ‌చ్చార‌ని అన్నారు. ఇటీవల గంగా - కావేరి నదుల అను సంధానానికి సాయం చేయాల్సిందిగా రైతు సంఘాల సమాఖ్య నాయకులు మా అన్న‌య్య‌ని కోరిన నేపథ్యంలో.. ఆయ‌నీ నిర్ణ‌యం వెలువ‌రించార ని చెప్పారు.


అన్న‌ట్లు ర‌జ‌నీ ఆరోగ్యంపై అనేకానేక వార్త‌లు వ‌స్తున్నాయి. సోకాల్డ్ జ‌ర్న‌లిస్టుల‌లో కొంద‌రు ఎవ‌రికి ఏది అనిపిస్తే అది రాసి విసిరేస్తున్నారు. కంగారేం లేద‌ని కుటుంబ స‌భ్యులు వివ‌ర‌ణ ఇచ్చినా ఆ.. పెన్నుకు అడ్డూ..అదుపూ విచ‌క్ష‌ణా.. నియంత్ర‌ణా..ఉంటేగా..! తంజావూరులో బృహ‌దీశ్వ‌ర ఆల‌యం ఉంది. అక్క‌డికే ర‌జ‌నీ సోద‌రుడు వ‌చ్చి పూజ‌లు చేసి వెళ్లారు. అన్న‌య్య సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని ప్రార్థిస్తూ... ఆయ‌నే కాదు మ‌నమూ ప్రార్థిద్దాం.. దేవుడి గారికి ఓ విన‌తి అందిద్దాం. ఈ త‌ర‌హా మ‌నిషి క‌ల‌కాలం వ‌ర్థిల్లాల‌ని.. నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాల తో.. జీవించాలని.. ఔను! ఇలా కోరుకోవ‌డం స్వార్థమా! అన్న‌ట్లు వెళుతూ..వెళుతూ.. ఈ తీపి క‌బురు అందించి వెళ్లారు. న‌దుల అనుసంధానం కోసం ర‌జ‌నీ త‌న‌వంతు కోటి విరాళం ప్ర‌క‌టించార‌ని...! హా..శ్చ‌ర్యం..! నిభిడాశ్చ‌ర్యం!

మ‌నుషులు త‌మ‌లో తామే క‌ల‌హించుకుని ఇత‌రుల జీవితాల‌ను ఛిద్రం చేసే మ‌నుషులు. బిందెడు నీళ్ల కోసం బండెడు క‌ష్టం ఓర్చే మ‌నుషులు. మ‌నుషులు.. త‌మ వ‌ర‌కూ త‌మ‌ని పరిమితం చేసుకునే మ‌నుషులు. అంతటా మ‌నుషులు. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన మ‌నుషులు కొంద‌రు స్టూడియో లు నిర్మాణం అంటూ ఇటుగా అంటే విశాఖ వైపు లగెత్తుకు వ‌స్తున్నారు. వెల్ క‌మ్ చెప్పండిరో..! మ‌నుషులు తాము ఏ స్థితిలో ఉన్నా ఇత‌రుల కోసం ఆలోచించే మ‌నుషులు. చ‌రిత్ర‌లో ఓ పుట‌ని త‌మ కోసమే కేటాయించుకునే మ‌నుషులు. ర‌జ‌నీ లాంటి ఓ గొప్ప స్టార్ మాత్రమే చేయ‌గ‌ల‌రా ఈ త‌ర‌హా ఆలోచ‌న‌ని అంటే ఏం చెబుతాం? ర‌జ‌నీ కోవ‌లోనే ప‌వ‌న్ లాంటి స్టార్ మాత్ర‌మే తోటి వ్య‌క్తికి చేయూత‌నివ్వ‌గ‌ల‌రా అంటే ఏం చెబుతాం? అయితే గియితే కొంద‌రు స్పందిస్తారు అదీ మీడియా క‌వ‌రేజీ కోసం.. అయితే గియితే కొంద‌రు స్పందిస్తారు స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం. సో.. ఎప్ప‌టిలానే సింహం సింగిల్ గానే వ‌స్తుంది. వ‌స్తుందిగా "క‌బాలి".. చూడండి..ఎంజాయ్ చేయండి.. క‌లెక్షన్ల సునామీ సృష్టించండి అని చెప్ప‌ను కానీ.. రజ‌నీ లాంటి స్టార్‌లు ఎన్నేళ్లైనా ఇంకా ఒదిగే ఉంటారు..శిఖరం చేరుకున్నా వారింకా నేల‌కు చేరువ అని మాత్రం గ్ర‌హించండి.. గుర్తించండి.


                                                                                                               Continue Reading